కొన్ని తరాలనునుండి తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములను వేరే వ్యక్తుల పేర్ల మీద అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం అన్యాయమని అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ బూరిగ, చినకోనెల గ్రామాల గిరిజనులు వాపోయారు. అధికారుల తీరును నిరసిస్తూ గురువారం గ్రామాల్లోనే అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, రెండు గ్రామాల్లో 70 కుటుంబాలకు చెందిన గిరిజనులు 105 ఎకరాలను అనాదిగా సాగు చేసుకుంటున్నట్టు చెప్పారు. అయితే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో కొంతమంది భూస్వాములు కుమ్మక్కై వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దీనిపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.