గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నుంచి మినహాయింపు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న తమను సీఆర్టీలుగా మార్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు, అధ్యాపకులు 12 రోజుల నుంచి ఐటీడీఏ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా సీపీఎం నాయకులు గురువారం శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా అప్పలనర్స మాట్లాడుతూ, గత 15 ఏళ్లగా విద్యారంగంలో అన్ని శాంక్షన్డ్ పోస్టుల్లో అవుట్ సోర్సింగ్, సీఆర్టీలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు వున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమన్నారు. ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజన ప్రాంతంలో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బొజ్జన్న, చిన్నారావు, దాస్, గురుకులాల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.