ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే అభియోగంపై విశాఖపట్నం జోన్-2 కమిషనర్ పి.సింహాచలాన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం, జోన్-8లో అక్రమ భవనానికి ప్లానింగ్ సెక్రటరీ సహకరించారనే ఆరోపణలు రావడం జీవీఎంసీ ప్రతిష్ఠకు మచ్చగా మారింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బంది అవినీతికి అడ్డుకట్ట వేస్తేనే జీవీఎంసీని గాడిలో పెట్టలేమని గుర్తించిన కమిషనర్ పి.సంపత్‌కుమార్ అందుకోసం కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలతో నగరంపై ఒక అవగాహన ఏర్పరచుకున్న కమిషనర్ జోన్‌ల వారీగా ప్రతి అధికారి, ఉద్యోగితో నేరుగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. జోన్‌ల వారీగా సమస్యలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా ఒక నివేదిక తయారుచేసుకున్నారు.
రోజుకొక జోన్ చొప్పున సమీక్షలు నిర్వహి ంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే బుధవారం జోన్-8 (గాజువాక)లో సమీక్ష నిర్వహించిన కమిషనర్, గురువారం జోన్-4 (సూర్యాబాగ్)లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగుల పనితీరు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతిపై ప్రధానంగా కమిషనర్ ప్రస్తావించినట్టు తెలిసింది. ప్రతి ఉద్యోగి ఏం చేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారునేదానిపై తనకు సమాచారం ఉందని పేర్కొంటూ...కొంతమంది పనితీరు మార్చుకోనిపక్షంలో కఠిన చర్యలకు గురికాకతప్పదని హెచ్చరించినట్టు సమాచారం. టౌన్‌ప్లానింగ్ విభాగంలో వార్డు ప్లానింగ్ కార్యదర్శులే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నట్టు తనకు ఫిర్యాదులు అందుతున్నాయని, ఇకపై అలాంటి వాటికి స్వస్తి పలకాలని కమిషనర్ సూచించినట్టు తెలిసింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ స్పష్టంచేసినట్టు సమీక్షకు హాజరైన అధికారులు చెబుతున్నారు.
![]() |
![]() |