ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఫార్మా కంపెనీలలో ప్రమాదాలకు అంతులేకుండా పోతోంది. భారీ ప్రమాదాలు జరిగి పెద్ద సంఖ్యలో కార్మికులు చనిపోతున్నా అధికారులు కఠిన చర్యలు చేపట్టడం లేదు. చనిపోయిన వారికి నష్టపరిహారం ఇచ్చేస్తే సమస్య పరిష్కారం అయిపోయినట్టుగా భావిస్తున్నట్టున్నారు. అందుకే యాజమాన్యాల నిర్లక్ష్యానికి చెక్ పెట్టలేకపోతున్నారు.ఉమ్మడి జిల్లాలోని రాంకీ ఫార్మాసిటీలో 100, అచ్యుతాపురం సెజ్‌లో 210 పరిశ్రమలు ఉన్నాయి. ఇవికాకుండా నక్కపల్లిలో హెటిరో డ్రగ్స్ కంపెనీ ఉంది. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో మూడు నెలల క్రితం భారీపేలుడు సంభవించి 17 మంది చనిపోయారు. దీనిపై అన్ని శాఖల అధికారులు హడావుడి చేశారు.
కూటమి నేతలు పరామర్శలకు క్యూకట్టారు. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. మూడు నెలలు అవుతోంది. ఇప్పటివరకూ నివేదిక ఇవ్వలేదు. అంత భారీ ప్రమాదాన్ని కూడా అధికారులు తేలిగ్గా తీసుకోవడం, యాజమాన్యంపై కఠిన చర్యలు లేకపోవడం వల్ల మిగిలిన సంస్థలు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. ఈ ఏడాది ఆగస్టు 21న ఎసెన్షియాలో ప్రమాదం జరగ్గా, ఆ మరుసటిరోజే సినర్జీస్‌లో ప్రమాదం చోటుచేసుకుని మరో నలుగురు చనిపోయారు. ఆ తరువాత రాంకీ ఫార్మాసిటీలో కూడా ప్రమాదం జరిగితే గుట్టుగా ఉంచి రెండు రోజుల వరకూ బయటకు తెలియనివ్వలేదు.తాజాగా ఠాగూర్ కంపెనీలో ప్రమాదకరమైన హైడ్రోక్లోరిక్ వాయువు లీకై గురువారం నాటికి ఇద్దరు మరణించారు. వాస్తవానికి లీకైంది క్లోరిన్ వాయువని ఆ రంగానికి చెందినవారు చెబుతున్నారు. గత నెలలోనే ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు ఆ కంపెనీకి తనిఖీకి వెళ్లారు. ఎటువంటి సూచనలు చేశారో బయటపెట్టడం లేదు. అన్నీ సరిగ్గా ఉంటే ప్రమాదం ఎలా జరిగిందనేది అనుమానంగా ఉంది.