రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా ఏపీ ఛాంబర్ ఈ బిజినెస్ ఎక్స్‌పో ఏర్పాటు చేయడం అభినందనీయం అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం ఏపీ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బిజినెస్ ఎక్స్‌పోను మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ఎక్స్ పోలో వివరిస్తున్నారన్నారు.పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే అనువైన మార్గాలు ఇక్కడ తెలుసుకోవచ్చన్నారు. మనకి తీర ప్రాంతంలో ఎంతో సంపద ఉందని... దాని పై దృష్టి పెట్టకపోవడం వల్ల నష్ట పోయామని తెలిపారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు వచ్చాక నేడు ఏపీ రూపు రేఖలు మారుతున్నాయన్నారు.
గతంలో చంద్రబాబు విజన్ 2020 అంటే నవ్వారని.. కానీ ఇప్పుడు హైదరాబాద్‌ను చూస్తే చంద్రబాబు దూరదృష్టి అందరికీ అర్ధమైందన్నారు. విభజన తరువాత బస్సులో ఉండి పాలన చేశారని.. ఎన్నో పరిశ్రమలను ఏపీకి తీసుకువచ్చారని తెలిపారు.గత ప్రభుత్వం నిర్వాకం వల్ల అన్నీ వెనక్కిపోయాయని మండిపడ్డారు. ఇప్పుడు విజన్ 2047 అని చంద్రబాబు ప్రకటించారని.. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పాలన సాగుతోందన్నారు. గత ఐదేళ్లల్లో రాష్ట్రం వదిలిన వారు ఇప్పుడు మళ్లీ ఏపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వపరంగా పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సహకాలు ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం ఉపయోగించు కోవాలని కోరారు. ఇటువంటి ఎక్స్ పోలకు వచ్చి ఉన్న అవకాశాలు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు కూడా ఎంతో అవసరమన్నారు. ఎక్కడకి వెళ్లినా మన తెలుగు వాళ్లు సత్తా చాటుతున్నారన్నారు. మచిలీపట్నంలో పోర్ట్ నిర్మాణం జరుగుతోందని.. అక్కడ కూడా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. లక్ష్యాలను నిర్ధేశించుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.