పాయకరావుపేట పట్టణంలో జల్ జీవన్ మిషన్ పథకం కింద మంజూరైన వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం కింద పట్టణంలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరుస్తామన్నారు. రూ. 95 లక్షలతో ట్యాంకును నిర్మిస్తున్నామని తెలిపారు.ఇంతముందు మండలంలో అడ్డరోడ్డు నుంచి కోటవురట్ల మండలం రామచంద్రపురం వరకు రూ.24.32 కోట్లతో చేపట్టనున్న ఆర్‌అండ్‌బీ రోడ్డు అభివృద్ధి పనులకు శుక్రవారం దార్లపూడి వద్ద ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో తాము ప్రతిపక్షంలో వున్నప్పుడు ఈ రోడ్డు దుస్థితిపై పాదయాత్ర చేశానని, నాడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు అభివృద్ధికి చర్యలు చేపట్టానని చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో పంచాయతీల్లో చిన్నపాటి రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. దార్లపూడిలో పూర్తిగా దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్డును నెల రోజుల్లో అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు.