ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2 మూవీ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది.ముఖ్యంగా తొలిరోజు దాదాపు రూ.280 కోట్లు రాబట్టి అల్లు అర్జున్ మూవీ సత్తా చాటింది. అయితే ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు ఇలాకాలో పుష్ప 2 ప్రదర్శనకు అడ్డంకులు!
పుష్ప సినిమాపై ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో కక్ష్య సాధింపు చర్యలు అధికమయ్యాయని విమర్శలు వస్తున్నాయి. అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేస్తున్నారు. కుప్పంలో పుష్ప2 సినిమా షో నడుస్తుంటే లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. టీడీపీ సీనియర్ నేతకు చెందిన 2 థియేటర్లకు అధికారులు తాళాలు వేయడంపై పట్టణంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
సినిమా థియేటర్ల లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా, ఎన్. ఓ .సి సర్టిఫికెట్ లేకుండా థియేటర్ నడుపుతున్నారంటూ అధికారులు ఆ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. పుష్ప-2 సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు తాళాలు వేయడంతో అల్లుఅర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. మూవీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంటే, అధికారులు థియేటర్లను సీజ్ సరికాదని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభిమానులకు, ప్రేక్షకులకు సినిమాను దూరం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
థియేటర్ల సీజ్పై అధికారులు ఏమన్నారంటే..
రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడూ తనిఖీలు చేపట్టి.. పర్మిషన్ లేని థియేటర్లను సీజ్ చేయడం కొత్త విషయం కాదనేది అధికారుల మాట. థియేటర్లు నిర్వహించడానికి ఓనర్లు లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని రెవెన్యూ అధికారులు తెలిపారు. అన్ని వసతులు, సౌకర్యాలు, పర్మిషన్లు ఉన్నాయని చూపించి థియేటర్ యాజమాన్యం అధికారుల నుంచి ఎన్ఓసీ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా ఉన్న ఏ చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. అందులో భాగంగా థియేటర్లలో తనిఖీలు చేపట్టి, పర్మిషన్ లేని వాటిని మాత్రమే సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.