ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ శనివారం అట్టహాసంగా జరిగింది. సుమారుగా 45 వేలకు పైగా పాఠశాలలో ఒకేరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల చదువులు, పాఠశాలల్లో మౌలిక వసతుల గురించి చర్చించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొనగా.. కడప మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతోనూ, వారి తల్లిదండ్రులతోనూ పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. మధ్యాహ్న భోజనం పనితీరును పరిశీలించేందుకు విద్యార్థులతో కలిసి పవన్ కళ్యాణ్ సహపంక్తి భోజనం చేశారు.
అనంతరం సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయులు పుట్టిన నేల ఇది అంటూ కొనియాడారు. కడప ప్రాంతం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేసినప్పటికీ ఈ ప్రాంతంలో నీటి సమస్యకు పరిష్కారం లభించలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కడప వాసుల తాగునీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే కడప మున్సిపల్ హైస్కూల్‌లో కిచెన్ ఆధునీకరణకు అవసరమైతే తన సొంత ట్రస్టు నుంచి నిధులు కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారు చేయడమే తమ ఉద్దేశమన్న పవన్ కళ్యాణ్.. పాఠశాలల స్థలాలు కబ్జాకు పాల్పడే వారిపై గూండా యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కడప జిల్లాలోని పాఠశాలల్లో ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన పవన్ కళ్యాణ్ వారికి కీలక సూచనలు చేశారు. హీరోలను సినిమాల్లో నటించేవారిలో కాకుండా పాఠాలు బోధించే ఉపాధ్యాయులలో చూసుకోవాలని సూచించారు. దేశం కోసం పోరాడుతూ అమరులైన జవాన్లు, తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు నిజమైన హీరోలు అని, వారిని గౌరవించాలని పవన్ కళ్యాణ్ విద్యార్థులకు సూచించారు.
అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. విద్యార్థులు సోషల్ మీడియాను తక్కువగా వాడేలా చూసుకోవాలని.. స్మార్ట్ ఫోన్‌ను వారు ఎలా ఉపయోగిస్తున్నారనే విషయాన్ని ఓ కంటితో గమనిస్తూ ఉండాలని చెప్పారు మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లీదండ్రుల మీద ఉందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. మాదకద్రవ్యాల వ్యాప్తిపైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.