ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా బంగాళాఖాతంలో మారో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహా సముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ మేరకు అల్పపీడనం వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఆదివారం (డిసెంబర్ 8) రోజు ముగిసేనాటికి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.ఇది పశ్చిమ వాయవ్య దిశగా కొనసాగుతూ 11వ తేదీ నాటికి శ్రీలంక-తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతం సమీపానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణాజిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే దీని ప్రభావంతో డిసెంబర్ 11, 12 తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.
డిసెంబర్ 12వ తేదీన ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక ఈ రోజు (ఆదివారం) అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అల్పపీడనం ప్రభావంతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.అల్పపీడనం ప్రభావంతో ఆదివారం వేకువ జామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఈ రోజంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జిల్లాలో ఇప్పటికే వర్షం కురుస్తుండగా.. తాజా అలర్ట్ ప్రకారం హైదరాబాద్ నగరంలోని తూర్పు ప్రాంతంలోనూ నేడు భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. అకాల వార్షాల వల్ల కల్లాల్లో ఉన్న ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.