కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం కావడంతో భక్తుల రాక ఎక్కువగా ఉంది. ఇక, శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 24 కంపార్టుమెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. శనివారం మొత్తం 78,569 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.54 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు, జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే.
మరోవైపు, తిరుమల శ్రీవారి ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు నిర్ణయించింది. 2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన విషయం తెలిసిందే.. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం (ఏఏడీ) కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం అర్చనానంతర దర్శన సేవ లేకపోవడంతో ప్రస్తుత ధర్మకర్తల మండలి ఈ పథకం దాతలకు ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ (జనరల్)దర్శనం కల్పించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.
‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ దాతలకు సవరించిన సౌకర్యాల వివరాలను టీటీడీ వెల్లడించింది. అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 గురు కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలకు అనుమతిస్తారు. అలాగే, రూ.2,500/- టారిఫ్‌లో ఏడాదికి 3 రోజులు వసతి కల్పిస్తారు. అంతేకాదు, ఏడాదికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందజేస్తారు. దాతల దర్శన సమయంలో ఏడాదికి ఒకసారి ఒక దుపట్టా, ఒక జాకెట్టు ముక్క బహుమానంగా ఇస్తారు.
అలాగే, దాతల మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50-గ్రాముల వెండి నాణెం కూడా ఇవ్వనున్నారు. సంవత్సరానికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు. అంతేకాదు, విరాళం పాస్‌బుక్ జారీ చేసిన తేదీ నుంచి 25 సంవత్సరాల పాటు ఇది చెల్లుబాటులో ఉంటుంది.