శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట స్థానిక శ్రీదేవి నగర్లో నివాసం ఉంటున్న అంధవరపు మధు భార్య స్వాతి (40) మంగళవారం అనుమానాస్పంద స్థితిలో మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గత కొన్నాళ్లుగా శ్రీదేవి నగర్లో ఉపాధ్యాయుడు అంధవరపు మధు భార్య స్వాతి, కుమార్తె ప్రణివితో కలిసి ఉంటున్నారు. మంగళవారం మధు తన తల్లి చనిపోయిన ఏడాది కార్యక్రమానికి శ్రీకాకుళంలోని స్వగృహానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి భార్య స్వాతి ఊరివేసుకుని మృతి చెంది ఉంది. అయితే స్వాతి మృతికి మధుయే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో కుమార్తె చదువుకునేందుకు పాఠశాలకు వెళ్లింది. స్వాతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి తలుపులు తీసి ఉండడం, మధ్యాహ్నం 3 గంటల వరకు చుట్టుపక్కల వారితో మాట్లాడడం జరిగిందని స్థానికులు చెబుతు న్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ దుర్గా ప్రసాద్ ఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతురాలి భర్త మధు నిమ్మాడ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.