మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఆర్ధిక స్కాంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 2019-24 మధ్య ఏపీని అన్ని విధాలా నాశనం చేశారని మండిపడ్డారు. వైఎస్ బిడ్డగా అవకాశం ఇస్తే అడ్డగోలుగా దోచేశారని ఆరోపించారు. ఈసారి రెండు స్థానాలు కూడా జగన్‌కు వచ్చే అవకాశం లేదన్నారు. జగన్ చేసిన అన్ని స్కాంల పైన ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టాలని సీఎంను కోరుతున్నామన్నారు.వైసీపీ నాయకులు చాలా మంది దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. కాకినాడ పోర్ట్‌ను కేవీ రావును బెదిరించి లాక్కున్నారన్నారు. వాటిపై విచారణ చేసి కేవీ రావుకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. జగన్ - అదానీ మధ్య జరిగిన ఒప్పందంలో రూ.1750 కోట్లు అవినీతి జరిగిందన్నారు. జగన్ డబ్బులు తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయన్నారు. ఈ స్కాంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోపిడీలు చేసి ఎవరికి వారు ఆర్ధికంగా దోచుకుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.