ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసద్ పెంపుడు సింహానికి ఆహారంగా ఖైదీలు.. వెలుగులోకి మాజీ అధ్యక్షుడి అకృత్యాలు

international |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 09:33 PM

సిరియాలో 54 ఏళ్లు పాటు కొనసాగిన నియంత పాలన ముగియడంతో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. అసద్ కుటుంబంపై 13 ఏళ్ల కిందట మొదలైన తిరుగుబాటులో ఎట్టకేలకు విజయం సాధించారు. సిరియా రాజధాని డమాస్కస్‌లోకి తిరుగుబాటుదళాలు గతవారం ప్రవేశించడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి రష్యాకు పారిపోయాడు. బషర్‌ అల్‌ అసద్‌  పాలనలో కొనసాగిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తనను వ్యతిరేకించే వారిని శిక్షించేందుకు సైద్నాయ మిలటరీ జైలును ఏర్పాటు చేసి.. ప్రత్యక్ష నరకం చూపించాడు. అసద్ పాలనలో అధికారులు కూడా దారుణాలకు పాల్పడ్డారు. అసద్ ఇంటెలిజెన్స్‌ విభాగంలో టైగర్ ఫోర్స్‌ కీలక అధికారి ప్రవర్తనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.


టైగర్‌ ఫోర్స్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి తలాల్ దక్కాక్‌.. జైల్లో ఖైదీలను తీసుకెళ్లి తన పెంపుడు సింహానికి ఆహారంగా వేసేవాడు. తనకు ఎవరైనా ఎదురు తిరిగితే వారందరికీ ఇదే గతిపట్టించేవాడు. సిరియాను స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదళాలు.. దక్కాక్‌ను పశ్చిమ ప్రాంతం పట్టణం హమాలో బహిరంగంగా ఉరితీసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.


దక్కాక్ అధీనంలో దాదాపు 1500 మంది సిబ్బంది పనిచేసేవారు. అసద్ అండతో రెచ్చిపోయిన దక్కాక్.. సొంతంగా నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన అధికారాన్ని ఉపయోగించి 2005లో జూ నుంచి శిక్షణపొందిన ఓ సింహాన్ని తీసుకొచ్చి.. ఎదురుతిరిగినవారిని దానికి ఆహారంగా వేసేవాడు. దక్కాక్‌ సాగించిన దారుణాలు అన్నీ ఇన్నీ కాదు. బలవంతపు వసూళ్లు, హత్యలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, మానవ అవయవ అక్రమ రవాణా లాంటి అనేక నేరాలకు తెగబడ్డాడు. ఆ నరరూప రాక్షసుడ్ని బహిరంగంగా ఉరితీసినట్టు తెలుసుకున్న ‘హమా’ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో అతడు సింహాన్ని వెంటేసుకుని తిరిగిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


రెబల్ నేత అబు మహ్మద్ అల్ జొలానీ మాట్లాడుతూ. సిరియా ప్రజలను వేధించి, చిత్రహింసలకు గురిచేసిన క్రిమినల్స్, హంతకులు, భద్రత, సైనిక అధికారులు ఎవర్నీ వదలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. డమాస్కస్‌ను హస్తగతం చేసుకున్న వెంటనే బషర్ అల్ అసద్ తండ్రి హఫీజ్ అల్ అసద్ విగ్రహాలను ప్రజలు ధ్వంసం చేసి వీధుల్లో ఈడ్చుకెళ్లిన వీడియోలో వైరల్ అయ్యాయి. హఫీజ్ సమాధిని కూడా కూల్చివేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa