జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకూ ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి యాత్రికులు, సాధువులు, పర్యటకులు సహా దాదాపు 45 కోట్ల మంది వస్తారని అంచనా. దీనికి అనుగుణంగా సన్నాహాలు చేసినట్టు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెల్లడించింది. యూపీ జలశక్తి, వరదల నివారణ శాఖ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ ఈ మేరకు ప్రకటన చేశారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహాకుంభమేళా గతంలో కంటే అద్భుతంగా జరగనుందని తెలిపారు.
‘‘ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు దాదాపు 450 మిలియన్ల మంది యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యటకులు వస్తారని అంచనా వేస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక క్రతువును స్వచ్ఛమైన, ఆరోగ్యమైన, సురక్షితమైన, డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా నిర్వహించనున్నాం’’ అని మంత్రి స్వతంత్ర దేవ్ పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 3 లక్షల మొక్కలు నాటామని, కుంభమేళా ముగిసిన తర్వాత కూడా వాటిని సంరక్షిస్తామని వివరించారు.
100 పడకలతో ఓ ఆసుపత్రి.. 20 పడకలతో రెండు ఆసుపత్రులు.. 8 పడకలతో చిన్న చిన్న ఆసుపత్రులను ఏర్పాటుచేశామని, 10 పడకలతో ఐసీయూను ఆర్మీ ఆసుపత్రి ఏర్పాటుచేసిందని చెప్పారు. అలాగే, యాత్రికులకు వైద్య సహాయం కోసం 291 మంది వైద్యులు, వైద్య నిపుణులు, 90 ఆయుర్వేద, యునానీ నిపఉనులు, 182 నర్సింగ్ సిబ్బంది ఉంటారన్నారు. త్రివేణి సంగమం వద్ద 35 శాశ్వత ఘాట్‌లతో పాటు కొత్తగా మరో 8 ఘాట్‌లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. అలాగే, ఈ కార్యక్రమ ఏర్పాట్లుకు సంబంధించి వెబ్‌సైట్, యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
అలాగే, మహాకుంభమేళాలో తొలిసారి భక్తులు, యాత్రికుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా 11 భాషల్లో ఏఐ చాట్‌బాట్ సేవలు ఉపయోగించుకోబోతున్నారు. వాహనాల పార్కింగ్ కోసం క్యూఆర్ కోడ్ పాస్‌లు జారీచేయనున్నట్టు వివరించారు. చాట్‌బాట్ ద్వారా మహాకుంభమేళా విశేషాలతో పాటు చరిత్ర, పూజలు, ప్రయాణ, విడిది సౌకర్యాల వివరాలు ఉచితంగా అందిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది యాత్రికులు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారు. మహాకుంభమేళా కోసం రెండు రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోదీ రూ.5,500 కోట్ల విలువైన 167 పనులకు శంకుస్థాపన చేశారు.