పుట్టిన పిల్లలకు పేరు పెట్టేందుకు తల్లిదండ్రులు తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కాదు. జాతకాలు చూపించి కొందరు, తమకు నచ్చిన దేవుళ్లు, హీరోల పేర్లు కలిసేలా పెట్టుకోవాలని మరికొందరు అనుకుంటుంటారు. అలాగే ఆలోచించాడో తండ్రి. తనకు పుట్టిన కుమారుడికి శని దేవుడి పేరు కలిసొచ్చేలా నామకరణం చేయాలనుకున్నాడు. అది ఆయన భార్యకు నచ్చలేదు. పిల్లాడికి ఆమె చెప్పిన పేరే పెట్టాలని గొడవ చేసింది. అది భర్తకు నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. అది కాస్త చిలికి చిలికి గాలివానలా మారి విడాకుల తీసుకోవడం వరకూ వెళ్లింది. అయితే కోర్టు వరకు వీరి విడాకుల కేసు వెళ్లగా.. కోర్టు ఏం చెప్పిందంటే?
మైసూరు జిల్లాలోని హున్‌సూర్‌కు చెందిన దంపతులకు నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లైన కన్ని నెలలకే భార్య గర్భం దాల్చింది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె పుట్టింటి వద్దనే ఉండాల్సి వచ్చింది. ఆమె అక్కడికి వెళ్లినప్పటి నుంచి భర్త ఆమెను కలవలేదు. అప్పుడప్పుడూ ఫోన్లు చేసేవాడు. కానీ ఏనాడు వెళ్లి చూడలేదు. అలా 9 నెలలు గడవగా.. ఆమె పండంటి బాబుకు జన్మను ఇచ్చింది. ఆ తర్వాత కూడా బాబు తండ్రి ఆమెను చూసేందుకు వెళ్లలేదు. కానీ ఫోన్ ద్వారా అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాడు.
అయితే పుట్టిన తన కొడుకుకు శని దేవుడికి సంబంధించిన పేరు పెట్టాలని.. ఓరోజు భార్యతో చెప్పాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. తన కుమారుడికి ఆది అనే పేరు పెట్టాలని చెప్పింది. అప్పటి నుంచి అదే పేరుతో పిలుస్తోంది కూడా. కానీ భర్తకు నచ్చకపోవడంతో అధికారికంగా ఈ పేరు నమోదు చేయలేదు. ఈ విషయంలో అటు అతడూ తగ్గక, ఇటు ఈమే తగ్గకపోవడంతో గొడవ ప్రారంభం అయింది. బాబు పుట్టి రెండు సంవత్సరాలు అయినా వీరు పేరు విషయంలో గొడవ పడుతూనే ఉన్నారు. ఇక ఈ సమస్య తేలేలా లేదని ఇధ్దరూ విడిపోవాలనుకున్నారు. విడాకుల కోసం కర్ణాటక హైకోర్టుకు కూడా వెళ్లారు.
ముఖ్యంగా భార్య సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం భరణం కావాలని కోరుతూ.. కోర్టును ఆశ్రయించింది. ఈక్రమంలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్సెంట్ సౌమ్య ఎమ్ఎన్ ఈ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లాడి పేరు విషయంలో గొడవ పడి.. బాబుకు తల్లో, తండ్రో లేకుండా చేయడం సరికాదని వివరించారు. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ వెనక్కి తగ్గారు. వారి కలిసేందుకు అంగీకరించారు. అయితే వీరిద్దరూ చెప్పిన పేర్లు కాకుండా మరేదైనా పేరు పెడితే తాము కలిసిపోవడానికి ఓకే అని చెప్పారు.
ఇదంతా విన్న కోర్టు.. బాబుకు ఆర్యవర్ధన అనే పేరును సజెస్ట్ చేయగా.. తల్లిదండ్రులు ఇద్దరూ ఓకే చెప్పారు. ఇలా కర్ణాటక జిల్లా సెషన్స్ కోర్టు బాబుకు పేరు పెట్టి ఆ జంటను కలిపింది. ఈ క్రమంలోనే దంపతుల ఇద్దరికీ పూల దండలు ఇచ్చి ఒకరి మెడలో ఒకరు వేసుకోవాలని సూచించింది. ఇదంతా చూసిన దంపతుల తల్లిదండ్రులతో పాటు బాబు కూడ కేరింతలు కొట్టాడు.