రోజురోజుకూ దేశంలో హత్యానేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఎవరూ ఊహించని స్థాయిలో రోజు దాదాపు పదుల సంఖ్యలు ప్రజలు హత్యలకు గురవుతున్నారు. క్షణికావేశంలో వారిని చంపి.. మిగతా వాళ్లు జైల్లకు వెళ్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఓ ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గాయాల పాలైన ఓ బాలుడికి సాయం చేయకుండా.. 17 ముక్కలుగా చేసి... రెండు వేర్వేరు చోట్ల పాతిపెట్టారు. వాళ్లు ఇలా ఎందుకు చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బహ్రైచ్‌లోని గాయత్రీ నగర్‌లో నివాసం ఉంటున్న 15 ఏళ్ల బాలుడు గత 10 రోజులుగా కనిపించడం లేదు. ఫోన్ చేసినా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో తమ కుమారుడికి ఏమైందోనన్న భయంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విక్రమ్ కనిపించకుండా పోయిన రోజు.. ఎక్కడికి వెళ్లాడు, ఎవరితో వెళ్లాడు వంటి విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యగా హార్వెస్టర్ నడిపే 24 ఏళ్ల సంజయ్ వర్మ దగ్గర పనికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
ముందుగా సంజయ్ వర్మను కలిసిన పోలీసులు.. విక్రమ్ గురించి ఆరా తీశారు. ఆ సమయంలో పొలంలో ఇంకా ఎవరెవరు ఉన్నారని ప్రశ్నించగా.. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న 18 ఏళ్ల లవకుష్ ఉన్నట్లు సంజయ్ చెప్పాడు. ఆ తర్వాత అతడిని కూడా విచారణకు పిలిచిన పోలీసులు.. విక్రమ్ తమ దగ్గర ఎంత సేపు ఉన్నాడు వంటి విషయాలను గురించి అడిగారు. చివరగా ఎక్కడ పని చేశారు వంటివి తెలుసుకుని వారిని పంపించి వేశారు. అయితే డిసెంబర్ 15వ తేదీ రోజు వాళ్లు పని చేసిన పొలానికి అతి దగ్గర్లో రక్తపు మరకలతో ఉన్న బట్టలు కనిపించాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు వాటిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత డాగ్ స్క్వాడ్‌లను పిలిపించి ఆ బట్టల వాసన చూపించారు. ఆపై అవి సంజయ్, లవకుష్‌ల వద్దకు వెళ్లాయి. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించారు. ఈక్రమంలోనే నిందితులు ఇద్దరూ తాము చేసిన నేరన్ని ఒప్పుకున్నారు. డిసెంబర్ 6వ తేదీన పనికి వచ్చిన విక్రమ్.. ప్రమాదవశాత్తు లవకుష్ నడుపుతున్న ట్రాక్టర్ కింద పడినట్లు సంజయ్ తెలిపారు. తీవ్ర గాయాలపాలైన విక్రమ్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లినా బతకడని, ఒకవేళ బతికినా అతడి వల్ల తాము సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన.. హార్వెస్టర్, ట్రాక్టర్ డ్రైవర్లు అయిన సంజయ్, లవకుష్‌లు విక్రమ్‌ను చంపాలనుకున్నట్లు వివరించారు.
తీవ్రగాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న అతడికి సాయం చేయకుండా.. బతికుండగానే హార్వెస్టర్‌లో పడవేసి 17 ముక్కలుగా చేశామన్నారు. ఆపై ఆ శరీర భాగాలను వేర్వేరు చోట్ల పాతిపెట్టామని.. తమకు అంటిన రక్తపపు మరకలను కడుక్కోవడానికి దగ్గర్లోని చెరువు వద్దకు వెళ్లినట్లు చెప్పారు. అక్కడే తమ బట్టలు విడిచి పారేసి వేరే బట్టలు వేసుకుని ఇళ్లకు వెళ్లిపోయినట్లు వివరించారు. నిందితుల సమాచారంతో విక్రమ్ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులను జైలుకు పంపారు.
కుమారుడి హత్య గురించి తెలుసుకున్న విక్రమ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అంత దారుణంగా తమ బాలుడి చనిపోయాడని తెలుసుకుని తల్లడిల్లుతున్నారు. మరీ ఇంత ఘోరంగా చంపాలా అంటూ వారు ఏడ్చిన తీరు.. స్థానికుల చేత కంటతడి పెట్టించింది.