భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌గారి భావజాలం మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా ‘అంబేద్కర్’ వ్యాఖ్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా స్పందించింది.వాళ్లు అంబేద్కర్ పేరును వందసార్లు అంటారు.. అన్నిసార్లు దేవుడ్ని పేరు తలుచుకుంటే పుణ్యం వస్తుందన్నట్టుగా’’ అమిత్ షా మాట్లాడిన మాటలు అపోహలకు దారితీశాయి. కాని, ఆ తర్వాత ఆయన అంబేద్కర్‌గారి గురించి కొనసాగిస్తూ ఆయన అన్న మాటలు, బీజేపీ సభ్యులు మాట్లాడిన మాటలు, ప్రధాని మోదీగారు మాట్లాడిన మాటలు.. గమనిస్తే అందరూ అంబేద్కర్‌గారిని గౌరవిస్తూ కొనియాడడం మంచి పరిణామం. అంబేద్కర్ గారిని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కించపరిచినా, పల్లెత్తు మాట అన్నా అది తప్పే. పేదవాడికి సమాన హక్కులు, గౌరవం ఉండాలనే అంబేద్కర్‌గారి భావజాలం మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఆ స్ఫూర్తి పరిఢవిల్లేలా విజయవాడ నగరం నడిబొడ్డున ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని వైయస్సార్‌సీపీ ప్రభుత్వం నిలబెట్టి, అద్భుతమైన స్మృతివనాన్ని నిర్మించింది. అంబేద్కర్‌గారు మాకే కాదు, యావత్ భారత దేశానికి ఆదర్శంగా చిరకాలం ఉంటారు. జై భీమ్..అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.