రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మేలు చేసిందేమీ లేకపోగా, ప్రజలను బాదడమే లక్ష్యంగా పెట్టుకుందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కరెంట్ చార్జీల పెంపును నిరసిస్తూ ప్రజల పక్షాన ఉద్యమిద్దామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇది అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడాల్సిన సందర్భమని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలపై కూటమి ప్రభుత్వం మోపిన భారంపై శాంతియుతంగా వైయస్ఆర్ సీపీ ఈ కార్యక్రమం చేపడుతోందని, ఇందులో పార్టీ క్యాడర్ అంతా క్రియాశీలకంగా పాల్గొనాలని సూచించారు.
ఈ నెల 21న వైయస్ జగన్ జన్మదినం సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అలాగే సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు అండగా నిలబడాలి, అవసరమైన లీగల్ ఎయిడ్ వెంటనే అందివ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్యనేతలతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.