భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గురువారం ఆమె ఎక్స్ సామాజిక మాధ్యమంలో స్పందించారు. ‘అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మను సంస్కృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్ర పన్నింది. అందులో భాగంగానే అంబేడ్కర్‌పై అమిత్‌షా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మను సంస్కృతిని బీజేపీ విశ్వసిస్తున్నందునే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోంది. రాజ్యాంగ నిర్మాతను ప్రతిసారి బీజేపీ హేళన చేస్తోంది. అమిత్‌షా వ్యాఖ్యలతో భారత రాజ్యాంగం మీద, జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని నిరూపితమైంది. అంబేడ్కర్‌ను అవమానించినందుకు అమిత్‌షా భారత జాతికి క్షమాపణలు చెప్పాలి. మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.