మన్యం ప్రాంతాల్లో డోలీ మోతలను తప్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అనారోగ్యం పాలైన వారు, గర్భిణులు, ముసలి వాళ్లను ఆస్పత్రులకు తరలించాలంటే ఈ ప్రాంతాల్లో డోలీ మోతలే దిక్కు. ఈ పరిస్థితిని మార్చేందుకు మన్యం ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 9 గిరిజన గ్రామాల్లో 49.73 కోట్ల రూపాయలతో 48 కి.మీ.ల మేర రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగింది.
శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బాగుజోలలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇక ప్రతి రెండు నెలలకు ఓసారి పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. ప్రతి రెండు నెలలకు ఓ సారి మూడు రోజుల పాటు ఇక్కడ పర్యటిస్తానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.గత వైసీపీ ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్‌కి 500 కోట్లు ఖర్చుపెట్టింది కానీ.. గిరిజన ప్రాంతాల్లో 9.50 కోట్లతో రోడ్లు వేయలేకపోయిందని పవన్ విమర్శించారు.
కిలోమీటర్ నడిస్తే కానీ.. మీ సమస్యలు తెలియవనే ఉద్దేశంతో కలెక్టర్ వర్షం పడుతోందని చెప్పినా కూడా వినకుండా నడుచుకుంటూ వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. డోలీలో గర్భిణిని మోసుకుంటూ తీసుకురావడానికి ఈ ప్రాంత వాసులు ఎంత ఇబ్బందిపడతారనేదీ తెలియాలంటే తాను కూడా నడవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చమని కోరి తిరుమల కొండ ఎక్కానని.. ఇప్పుడు మన కష్టాలు తీరాలని కొండ ఎక్కానని పవన్ కళ్యాణ్ అన్నారు.
మరోవైపు విజయనగరం, మన్యం జిల్లాలలో 20కి పైగా జలపాతాలు ఉన్నాయన్న పవన్ కళ్యాణ్.. ఇంత అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉన్నచోట పర్యాటకాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను అధికారం రాక ముందు ప్రజల్లోనే ఉన్నానన్న పవన్ కళ్యాణ్.. అధికారం వచ్చాక కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నట్లు చెప్పారు. మన్యం జిల్లాలో టూరిజానికి మంచి అవకాశాలు ఉన్నాయన్న డిప్యూటీ సీఎం.. టూరిజం ద్వారా ఇక్కడి యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
2017లో తాము అధికారంలోకి వస్తే రోడ్లు నిర్మిస్తామని మాట ఇచ్చానని.. ఆ మాటపైనే నిలబడ్డానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈరోజు సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం తరుఫున మరో మాట ఇస్తున్నానని.. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు 19 పంచాయితీలకు సంబంధించిన రోడ్ల కోసం 40 కోట్ల రూపాయలు మంజూరు చేశామని.. సంవత్సరంలో 350 కొట్ల రూపాయల చొప్పున ప్రతీ గ్రామం అనుసంధానం అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.