వైఎస్సా్ర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ వైసీపీకి రాజీనామా చేశారు. విశాఖ డెయిరీ ఛైర్మన్‌తో పాటుగా 12 మంది డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అడారి ఆనంద్ కుమార్ తెలిపారు. అడారి ఆనంద్ కుమార్‌తో పాటుగా డైరెక్టర్లు వరాహ వెంకట శంకర్రావు, శీరంరెడ్డి సూర్యనారాయణ, పిల్లా రమా కుమారి, దాడి పవన్ కుమార్, కోళ్ల కాటమయ్య, ఆరంగి రమణబాబు, చిటికెల రాజకుమారి, సుందరపు ఈశ్వర్, రెడ్డి రామకృష్ణ, పరదేశి గంగాధర్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు, తమ రాజీనామా లేఖలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.
మరోవైపు అడారి ఆనంద్ కుమార్ గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గణబాబు విజయం సాధించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అడారి ఆనంద్ కుమార్.. శుక్రవారం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు విశాఖ డెయిరీపై ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. 1973లో అక్కిరెడ్డిపాలెంలో ఈ డెయిరీని నెలకొల్పారు. ప్రస్తుతం రోజుకు 9 లక్షల లీటర్ల సామర్థ్యంతో విశాఖ డెయిరీ నడుస్తోంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3000 మంది వరకూ ఉపాధి పొందుతున్నారు. విశాఖ డెయిరీ పాలతో పాటుగా పాల ఉత్పత్తులకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా పొరుగున ఉన్న రాష్ట్రాలలోనూ మంచి మార్కెట్ ఉంది. ఇక విశాఖ డెయిరీకి 1986 నుంచి అడారి తులాసీరావు 36 ఏళ్లపాటు ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన చనిపోయిన తర్వాత 2023 నుంచి అడారి ఆనంద్ కుమార్ విశాఖ డెయిరీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు.
అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అడారి ఆనంద్ కుమార్ ఓటమి పాలయ్యారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విశాఖ డెయిరీ ఆవు పాల ధరను తగ్గించింది. లీటర్ ధరను రూ.34 నుంచి రూ.31కి తగ్గించింది. దీనిపై పాడి రైతులు ఆందోళన కూడా చేపట్టారు.ఇదే సమయంలో విశాఖ డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపణలు చేస్తూ వచ్చారు. రాజకీయ పార్టీలతో పాటుగా కొంత మంది పాడి రైతుల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయి.
ఆరోపణలపై వాస్తవాలను బయటపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హౌస్ కమిటీని కూడా నియమించింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో విశాఖ డెయిరీలో అక్రమాలపై శాసనసభా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇటీవల విశాఖ డెయిరీని సందర్శించింది. మూడు గంటల పాటు ప్లాంట్ మొత్తం పరిశీలించింది. అయితే విశాఖ డెయిరీపై వచ్చిన ఆరోపణలపై యాజమాన్యం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదని కమిటీ సభ్యులు తెలిపారు. విశాఖ డెయిరీ ఆర్థిక లావాదేవీలపై ఆడిటర్లు, నిపుణులతో సమగ్ర విచారణ చేయిస్తామని.. అనంతరం శాసనసభకు నివేదిక ఇస్తామని కమిటీ స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్యనే విశాఖ డెయిరీ ఛైర్మన్ వైసీపీకి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.