భారతదేశంలో ఉన్న అతికొద్ది సూర్య దేవాలయాల్లో ఏపీలోని అరసవల్లి సూర్య నారాయణస్వామి ఆలయం ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్ణణానికి సమీపంలో ఉన్న అరసవల్లిలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ కొలువైన సూర్యనారాయణస్వామిని దర్శించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని ప్రతీతి. ఇంతటి ప్రసిద్ధమైన అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.100 కోట్లతో అరసవల్లి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనారు.
ఈ క్రమంలోనే శ్రీకాకుళంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు.. పట్టణాల అభివృద్ధిలో వాణిజ్య, వ్యాపార సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. శ్రీకాకుళం సమగ్ర అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా రూ.100 కోట్లతో అరసవల్లి దేవస్థానం అభివృద్ధికి చర్యలు చేపట్టడంతో పాటుగా అరసవల్లిలో జరిగే రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తామని అచ్చెన్నాయుుడు వెల్లడించారు.
మరోవైపు అరసవల్లిలో రథసప్తమి వేడుకలను ఏటా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. సూర్య భగవానుడి పుట్టినరోజు సందర్భంగా రథ సప్తమి లేదా మాఘ సప్తమి పేరిట ఈ వేడుకలను నిర్వహిస్తారు. అరసవల్లిలో జరిగే రథ సప్తమి వేడుకలకు స్థానికులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే అరసవల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. 2025 ఫిబ్రవరి 4వ తేదీన అరసవల్లిలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అరసవల్లి రథసప్తమిని రాష్ట్ర పండుగగా మూడు రోజుల పాటు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మాఘ మాసంలో వచ్చే రథసప్తమి సందర్భంగా అరసవల్లి సూర్య భగవానుడు.. నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఏడాదికి ఒక రోజు మాత్రమే నిజరూపంలో దర్శనమివ్వనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు.