కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్సీ సీటీపై లైంగిక వేధింపులతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు.. బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా, శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ పట్ల.. ఎమ్మెల్సీ సీటీ రవి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ కేసులు నమోదయ్యాయి. ఇక పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్సీ సీటీ రవి ఆరోపించడం ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
బెళగావిలో జరిగిన కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా.. గురువారం చివరి రోజు సమావేశాల్లో భాగంగా ఆ రాష్ట్ర మహిళ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ శాసన మండలిలో ప్రసంగిస్తుండగా.. బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి తనపై అసభ్యకరమైన పదాన్ని ఉపయోగించారని ఆమె ఆరోపించారు. దీంతో ఎమ్మెల్సీ సీటీ రవిపై అధికారికంగా శాసనమండలి ఛైర్మన్‌కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. మహిళపై అలాంటి భాషను ఉపయోగించడం లైంగిక వేధింపులకు పాల్పడటమేనని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ సీటీ రవి చేసిన వ్యాఖ్యలను మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ సందర్భంగా తనను కించపరిచేలా బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. హిరేబాగేవాడి పోలీస్ స్టేషన్‌లో మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌పై ఫిర్యాదు చేశారు. మంత్రి ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్సీ సీటీ రవిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌లు 75 (లైంగిక వేధింపులు), 79 సెక్షన్ల కింద ఎమ్మెల్సీ సీటీ రవిపై కేసులు నమోదు చేశారు. ఇక రంగంలోకి దిగిన బెళగావి పోలీసులు.. ఎమ్మెల్సీ సీటీ రవిని అరెస్ట్ చేసి ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎమ్మెల్సీ సీటీ రవిని అరెస్ట్ చేసిన బెళగావి పోలీసులు.. శుక్రవారం ఉదయం బెంగళూరుకు తీసుకొచ్చారు. ఆయనను ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరుపర్చనున్నారు.