వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విజయసాయిరెడ్డి ముఠా చేయని కుంభకోణం లేదని ఆయన అన్నారు. ఏపీ జెన్ కోకు విజయసాయి అనుబంధ సంస్థ ట్రైడెంట్ నాలెడ్జ్ కంపెనీ 4.5 లక్షల టన్నుల నాసిరకం బొగ్గును అమ్మిందని... ఒక టన్ను బొగ్గును రూ. 8,500 కోట్లకు విక్రయించారని తెలిపారు. నాసిరకం బొగ్గు వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని... దీని కారణంగా ఎక్కువ ధరకు బయట సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేశారని... దీంతో ప్రజలపై భారీగా భారం పడిందని చెప్పారు. ట్రైడెంట్ నాలెడ్జ్ కంపెనీ సరఫరా చేసిన నాసిరకం బొగ్గు సరఫరాపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై సీఐడీ, విజిలెన్స్ ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదని ప్రశ్నించారు. విజయసాయి ముఠాపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. 108, 104 కుంభకోణాలపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ కుంభకోణాలపై చర్యలకు వివిధ శాఖలకు చెందిన సిబ్బంది సరిపోవడం లేదని అన్నారు.