అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మా సిటీలో మరోసారి విష వాయువులు లీక్ అయ్యాయి. రక్షిత డ్రగ్స్ నుంచి విష వాయువులు విడుదల అయ్యాయి. ఒక్కసారిగా వాయువులు విడుదల కావడంతో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కార్మికులు, కంపెనీ యాజమాన్యం బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.కాగా, పరవాడ ఫార్మాసిటీలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ 26న జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా లేబొరేటరీలో విషవాయవులు లీక్ అయ్యాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులంతా ఒక్కసారికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదకర వాయువులు విడుదల కావడంతో అందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన కార్మికుడు మృతిచెందగా.. 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబ నాయుడు సైతం స్పందించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్య సదుపాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.