పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో మృతదేహం పార్శిల్ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసులో కొత్తకోణం తెరమీదికి వచ్చింది. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న శ్రీధర్‌వర్మకు ఏకంగా మూడు పేర్లు.. ముగ్గురు భార్యలు ఉన్నట్టు తెలిసింది. కృష్ణాజిల్లా మల్లంపూడి గ్రామానికి చెందిన తిరుమాని సుధీర్ వర్మకు ముందుగా కాళ్ల మండలం ఎస్‌సీ బోస్ కాలనీ ఇస్కులంక గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. సుధీర్ వర్మ తన పేరును శ్రీధర్ వర్మగా మార్చుకుని యండగండికి చెందిన రేవతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.
అనంతరం సిద్ధార్థవర్మగా పేరు మార్చుకుని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పదేళ్ల వయసున్న కుమార్తె ఉంది. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న శ్రీధర్‌వర్మకి రెండో భార్య రేవతికి అక్క అయిన సాగి తులసితో ఆస్తి కోసం తగాదా ఏర్పడి.. ఆమెకు మృతదేహాన్ని ఎందుకు పంపించాడనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అసలు మృతదేహం ఎవరిది అనేది తెలియడం లేదు. ఇదే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో హత్య అని తేలినట్లు చెబుతున్నారు. దీనిపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మృతదేహం పార్శిల్ కేసులో శ్రీధర్ వర్మను సూత్రధారిగా భావిస్తున్నారని తెలిసింది.