మైనారిటీ వర్గాలకు తానెప్పుడూ అండగా ఉంటానని, వారి సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లు జరిగిన చెడును ఆలోచించి మళ్లీ అది జరగకుండా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పేదల పట్ల, ధర్మాన్ని నమ్మినవారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని, మళ్లీ మంచి రోజులు వచ్చాయని, మీ అందరికీ అనుక్షణం అండగా ఉంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ ఏ1 కన్వెన్షన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లోక రక్షకుడైన ప్రభువు కరుణ, కటాక్షాలు ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చంద్రబాబు అన్నారు. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రైస్తవమన్నారు. ఎన్టీఆర్ మిషనరీ కాలేజీలో చదువుకున్నారని గుర్తుచేసుకున్నారు. పశువుల పాకలో పుట్టి, గొర్రెల కాపరిగా పెరిగి నిరాడంబరతను చాటుకున్న ప్రజా రక్షకుడు ఏసు అని అన్నారు. నమ్మిన వారి కోసం బలిదానాలకు సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఉత్తేజంగా తీసుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తానెప్పుడొచ్చినా స్ఫూర్తిదాయక సందేశాన్ని పొందుతుంటానన్నారు. ‘సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలన్న దానిపై ముందుకు వెళుతుంటే ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను. మూడుసార్లు కష్టం అనిపించలేదు.ఇప్పుడు చాలా కష్టమనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు చూస్తే బాధేస్తోంది. ఈ ఆరు నెలల నుంచి రాత్రింబవళ్లూ ఆలోచిస్తున్నా, పట్టుదలతో ప్రయత్నిస్తున్నా దారి దొరకలేదంటే ఐదేళ్లు ఎంత విధ్వంసం జరిగిందో ఆలోచించాలి. ఆర్థిక ఇబ్బందులున్నా పాస్టర్లకు పెట్టిన గౌరవ వేతనాన్ని చెల్లించాలని సంతకం చేశాను. క్రైస్తవ మిషనరీల కోసం ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని, చర్చిల నిర్మాణం, పునర్నిర్మాణం కోసం ప్రతిపాదనలు వస్తున్నాయి. రానున్న రోజులలో సాధ్యమైనంత మేరకు పూర్తి చేస్తాం’ అని అన్నారు.