ప్రస్తుతం బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డులు లేనివారంటూ దాదాపుగా ఎవరూ లేరు. హోం లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డులు... ఇలా ఎన్నో రకాల రుణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా లోన్ తీసుకున్న వ్యక్తి ఒకవేళ దురదృష్టవశాత్తు మరణిస్తే... ఆ లోన్లు ఎవరు తీర్చాలనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. దీనిపై ఆర్థిక నిపుణులు పలు అంశాలను వెల్లడిస్తున్నారు. ఆయా లోన్లను బట్టి, ఆ లోన్లు తీసుకునేప్పుడు జరిగిన ప్రక్రియను బట్టి రుణాల తిరిగి చెల్లింపు ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. లన్ ఏదైనా, ఏ రకమైనా సరే... సహ రుణదారు, గ్యారెంటర్ ఉన్నప్పుడు ప్రధాన రుణ స్వీకర్త మరణిస్తే వారు రుణం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వారు చెల్లించకపోతే వారిపై బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. ఏదైనా ఆస్తి తాకట్టు పెట్టి ఉన్నట్టయితే... సదరు ఆస్తిని వేలం వేసి రుణాన్ని రికవరీ చేసుకుంటాయి.ఒకవేళ రుణాలకు సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే... బ్యాంకులు/ఆర్థిక సంస్థలు సంబంధిత ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకుని రుణాన్ని రికవరీ చేసుకుంటాయి.తీసుకున్న ‘హోం లోన్’ అయితే... సదరు ఇల్లును బ్యాంకుకు గ్యారెంటీగా పెట్టి ఉంటారు. కాబట్టి హోం లోన్ తీసుకున్నవారు మరణిస్తే... బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొదట వారి చట్టబద్ధ వారసులను లోన్ తీర్చాల్సిందిగా కోరుతాయి. ఒకవేళ వారు నిరాకరించినా, చెల్లించలేకపోయినా... సదరు ఇంటిని వేలం వేసి రుణాన్ని రికవరీ చేసుకునే హక్కు బ్యాంకులు/ఆర్థిక సంస్థలకు ఉంటుంది.ఒకవేళ కార్ లోన్, ఇతర వెహికల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. వారి వారసులను బ్యాంకులు/ఆర్థిక సంస్థలు సంప్రదిస్తాయి. వారు చెల్లించలేకపోయినా, నిరాకరించినా... సదరు వాహనాన్ని వేలం వేసి రుణాన్ని రికవరీ చేసుకుంటాయి.పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులను అన్ సెక్యూర్డ్ లోన్లుగా పేర్కొంటారు. అంటే వీటి విషయంలో బ్యాంకులు ఎలాంటి గ్యారంటీ తీసుకుని ఉండవు. ఒకవేళ రుణం, క్రెడిట్ కార్డులు తీసుకున్న వ్యక్తి మరణిస్తే... బ్యాంకులు వారి కుటుంబ సభ్యులను, చట్టబద్ధ వారసులను సంప్రదిస్తాయి. వారు చెల్లించేందుకు నిరాకరించినా... బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఏమీ చేయలేవు. చెల్లించాలంటూ బలవంత పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. అయితే వీలైనంత వరకు వారసులు ఇలాంటి రుణాలను తీర్చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పూర్తిగా తీర్చలేకపోతే... బ్యాంకులు/ ఆర్థిక సంస్థలతో చర్చించి వీలనంత మొత్తం చెల్లించి క్లోజ్ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. భవిష్యత్తులో వారసులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఇది ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.