తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు మంగళవారం విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. 2007లో ఓబులాపురం మైనింగ్ పరిశీలనకు వెళ్లిన 21 మంది నేతలపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం కోర్టుకు నేతలు ఈరోజు హాజరయ్యారు. మొత్తం 21 మందిపై కేసు నమోదు అవగా.. వీరిలో ముగ్గురు మరణించారు. మిగిలిన వారిని తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలంటూ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప, ఎర్రబెల్లి దయాకర్, అమర్నాథ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు బాబు రాజేంద్రప్రసాద్, కోళ్ల లలిత కుమారి, పొలం నాగరాజు, చిన్నబాబు రమేష్, గురుమూర్తి కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు విజయవాడ కోర్టు ఆవరణలో ఆంధ్ర తెలంగాణ నేతల కలయికతో సందడి నెలకొంది. ఒకప్పుడు అంతా తెలుగుదేశంలో ఉండి వేరే పార్టీలు మారిన తెలంగాణ నేతలు.. పాత మిత్రులతో ఆత్మీయ సంభాషణ జరిపారు.