పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి మండలం యండగండిలో మృతదేహం పార్శిల్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో నిందితుడు శ్రీధర్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న శ్రీధర్ వర్మకు ఏకంగా మూడు పేర్లు, ముగ్గురు భార్యలు ఉన్నట్లు తెలిసింది. శ్రీధర వర్మకు రెండో భార్య రేవతికి అక్క అయిన సాగి తులసితో ఆస్తి కోసం తగాదా ఏర్పడింది. తులసిని బెదిరించి ఆస్తి లాక్కునేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో రోజు వారీ కూలీలైన పర్లయ్య, రాజును పని ఇప్పిస్తానని శ్రీధర్ తీసుకువెళ్లాడు.
అయితే రాజుకు కుటుంబసభ్యులు ఉండటంతో అతడిని హత్య చేస్తే పెద్ద గొడవ అవుతుందని నిందితుడు భావించాడు. పర్లయ్యకు కుటుంబసభ్యులు ఉన్నా.. అతడిని హత్య చేస్తే ఎవరూ పట్టించుకోరు అని శ్రీధర్ భావించాడు. అనుకున్నదే తడువుగా పర్లయ్యను హత్య చేసి తులసి ఇంటికి పార్శిల్‌గా పంపించాడు. శవపేటికలో పర్లయ్య మృతదేహాన్ని ఉంచి స్వయంగా శ్రీధర్ బాబే తీసుకువచ్చి ఓపెన్ చేసిన తరువాత కారులో పరారైనట్లు చెబుతున్నారు.మరోవైపు పోస్టుమార్టం రిపోర్టులో పర్లయ్యదే మృతదేహం అని తేలింది. ఇక మృతదేహం పార్శిల్ కేసులో శ్రీధర్ వర్మే ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. ఇప్పటి వరకు టెక్నాలజీని ఉపయోగించి అనేక సిమ్‌లు మార్చి తిరుగుతున్న శ్రీధర్ వర్మను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో శ్రీధర్ వర్మ మూడో భార్య ఇంట్లో మరో శవపేటిక, పార్శిల్ కవర్లు లభ్యమయ్యాయి. మూడో భార్య కూడా మరో ప్రధాన నిందితురాలుగా ఉన్నట్లు సమాచారం.