మచిలీపట్నం నగరంలో బాలిక(13)పై అత్యాచారానికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఆదివారం ఇనకుదురు పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ అబ్దుల్ సుభాన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ‘రోడ్డుపై ఉన్న బాలికను చంపేస్తామని బెదిరించి కాసానిగూడెం పావురాలగూడు సెంటర్ నుంచి మహమ్మద్ సలేహా(21), సాదం బాలశంకరసాయి(19) బలవంతంగా నోరుమూసి బైక్‌పై మధ్యలో కూర్చోబెట్టుకుని పంపులచెరువు వెనుక వాటర్ హౌస్ వద్ద ఖాళీ ప్రదేశానికి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వారి స్నేహితు లు రామాని అశోక్(19), వేముల వెంకట పవన్(20)తో కలిసి నలుగురూ ఆ బాలికను చేతులతో చెంపలపై కొడుతూ శరీరంపై తాకకూడని ప్రదేశాల్లో తాకారు.
ఒకరి తరువాత ఒకరు ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశారు. దీంతో బాలిక కేకలు పెడుతూ పారిపోయింది. ఇంటికి వచ్చి తల్లికి చెప్పగా, తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.’ అని డీఎస్పీ తెలిపారు. దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేసి, గ్యాంగ్‌రేప్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి పంపామన్నారు. కాలేఖాన్‌పేట చెక్‌పోస్టు వద్ద నిందితులను అరెస్టు చేశామన్నారు.