కొత్త ఏడాది.. కొత్త పాలెంలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై భర్త ను భార్య హత్య చేసింది.మద్యానికి బానిసగా మారి వేధిస్తున్నాడంటూ భర్త ప్రాణాలు తీసింది. కొత్తపాలెంకు చెందిన అరుణ.. గోకర్ణమఠంకు చెందిన అమరేంద్రబాబుకు పదేళ్ల క్రితం వివాహం అయింది. గత నాలుగేళ్లుగా అమరేంద్రబాబు మద్యానికి బానిస అయ్యాడు. భార్య భర్తలమధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో అరుణ తన స్వగ్రామం అయిన కొత్తపాలెంలో ఉంటోంది. దీంతో అమరేంద్రబాబు ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన భార్య అరుణను కొట్టడంతో ఆమె కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేశారు. దాడిలో గాయపడి కిందపడిన భర్తను అరుణ గొంతుకు తాడు వేసి లాగి చంపడం స్థానికంగా కలకలం రేగింది.
కాగా మద్యానికి బానిసైన అమరేంద్రబాబు ప్రతి రోజు తాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన భార్య అరుణ.. నడి రోడ్డుపై భర్త మెడకు తాడు బిగించి హత్య చేసింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగింది... ప్రతి రోజూ భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చి వేధిస్తుండడంతో అరుణ అతనితో గొడవ పడి తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అమరేంద్రబాబు 31న సాయంత్రం భార్య వద్దకు వెళ్లి ఇంటికి రావాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో ఆమెను కొట్టాడు. దీంతో అరుణ కుటుంబ సభ్యులు అమరేంద్ర బాబుపై దాడి చేశారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో తనను జీవితాంతం వేధింపులకు గురి చేస్తున్నాడనే కోపంతో అరుణ హత్యకు పాల్పడింది. ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు అరుణ, ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.