అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు పోర్న్ స్టార్‌కు చెందిన హష్ మనీ కేసు మాత్రం వీడటం లేదు. ఈ హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటుండగా.. ఈ కేసులో వాదనలు ముగించిన కోర్టు.. జనవరి 10వ తేదీన తుది తీర్పును వెలువరించనుంది. తాజాగా ఈ కేసు గురించి సదరు జడ్జి స్పందించారు. హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు శిక్ష విధిస్తానని తేల్చి చెప్పారు. అయితే ఈ కేసులో ట్రంప్ శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం. హష్ మనీ కేసుపై తాజాగా విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 10వ తేదీన ఈ కేసులో శిక్ష విధిస్తానని న్యూయర్క్ జస్టిస్ హవాన్ మర్చన్ తాజాగా ఆదేశాలు జరీ చేశారు.
అయితే ఈనెల 20వ తేదీన అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే.. ట్రంప్ ఈ కేసులో దోషిగా తేలినా జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని జస్టిస్ హవాన్ మర్చన్ తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఈ కేసులో జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా అన్‌కండిషనల్ డిశ్చార్జ్‌ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇక శిక్ష విధించే జనవరి 10వ తేదీన వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా డొనాల్డ్ ట్రంప్ కోర్టులో హాజరయ్యేందుకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. దీంతో శిక్ష పడిన తర్వాత వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే తొలి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలవనున్నట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక డొనాల్డ్ ట్రంప్‌కు ఈ హష్ మనీ కేసులో శిక్ష విధించాలని న్యూయార్క్ కోర్టు జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ తీవ్రంగా ఖండించారు. చట్ట విరుద్ధమైన కేసును వెంటనే కొట్టివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్‌కు సంబంధించి హష్ మనీ కేసులో ఇప్పటికే ట్రంప్ దోషిగా తేలారు. ఈ కేసులో 2024 నవంబరులోనే న్యూయార్క్ కోర్టు శిక్ష విధించాల్సి ఉండగా.. అదే సమయంలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో ఆయన క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఆయన న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు శిక్షను కొన్ని రోజులు వాయిదా వేసింది. ఆ తర్వాత ఈ కేసులో ట్రంప్‌కు రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చి చెప్పింది.
పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్‌తో డొనాల్డ్ ట్రంప్ ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె ఈ విషయాన్ని బయటికి చెప్పకుండా ట్రంప్ తన లాయర్ ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్‌మనీని ఇప్పించారనేది ప్రధాన ఆరోపణ. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ప్రచార కార్యక్రమాల కోసం వచ్చిన విరాళాల నుంచి ఈ డబ్బును ఖర్చు చేశారని.. అంతేకాకుండా వాటి కోసం రికార్డులను మార్చేశారని ట్రంప్‌పై అభియోగాలు ఉన్నాయి. మొత్తం 34 అంశాల్లో ట్రంప్‌పై నేరారోపణలు నమోదు కాగా.. 6 వారాల విచారణ తర్వాత ట్రంప్‌పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో సంచలన తీర్పు ఇచ్చింది. ట్రంప్‌తో గడిపింది నిజమేనని స్టార్మీ డానియల్స్ కోర్టుకు వెల్లడించింది. ఆమెతో పాటు మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారణ జరిపింది.