థాయిలాండ్ ప్రధానమంత్రి పెటోంగ్టార్న్ షినవత్ర.. తన ఆస్తుల వివరాలను జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్-ఎన్ఏసీసీకు సమర్పించారు. కొన్ని నెలల క్రితం థాయిలాండ్ పీఎంగా పదవిని చేపట్టిన పెటోంగ్టార్న్ షినవత్రకు 400 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ.3500 కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి తక్సిన్ షినవత్ర చిన్న కుమార్తె అయిన ఈ పెటోంగ్టార్న్ షినవత్ర ప్రస్తుతం థాయిలాండ్ ప్రధానిగా కొనసాగుతున్నారు. 38 ఏళ్ల పెటోంగ్టార్న్ షినవత్ర వద్ద లగ్జరీ వస్తువులు ఉన్నట్లు తెలిపారు.
తన సంపద అక్షరాల రూ.3,430 కోట్లకు పైమాటేనని థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర వెల్లడించారు. అందులో 75 లగ్జరీ వాచ్‌లు, 200 డిజైనర్ బ్యాగులు కూడా ఉన్నాయని తెలిపారు. 400 మిలియన్ డాలర్ల విలువ థాయ్ కరెన్సీలో 13.8 బిలియన్ల బాత్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో 5 బిలియన్ బాత్‌ను ఆమె అప్పుల కింద చూపించినట్లు ఎస్ఏసీసీ వెల్లడించింది. డిపాజిట్లు, నగదు రూపంలో ఆమె వద్ద ఒక బిలియన్ బాత్ ఉన్నట్లు తెలిపింది.
అలాగే పెటోంగ్టార్న్ షినవత్రకు.. లండన్, జపాన్‌లో ఆస్తులు ఉన్నాయి. మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ ఒకప్పటి ఓనర్ కావడం గమనార్హం. ఇక తక్సిన్ షినవత్ర ఆస్తుల విలువ 2.1 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ఆయన థాయ్‌లాండ్‌లోని టాప్-10 మంది ధనవంతుల్లో ఒకరు కావడం గమనార్హం. టెలికమ్యూనికేషన్ సంస్థ షిన్ కార్పొరేషన్ ద్వారా ఆయన భారీ ఆస్తులు కూడబెట్టారు.
ఇదిలా ఉంటే థాయ్‌లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా పేటోంగ్టార్న్ షినవత్ర నిలిచారు. ఆమె తండ్రి తక్సిన్ షినవత్ర 2001లో థాయిలాండ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2006లో సైనిక తిరుగుబాటుతో ఆయన పదవి నుంచి దిగిపోయారు. 2011 నుంచి 2014 మధ్యకాలంలో పేటోంగ్టార్న్ షినవత్ర మేనత్త (తక్సిన్ షినవత్ర సోదరి) యింగ్లక్ షినవత్ర థాయిలాండ్ ప్రధానిగా ఉన్నారు.