ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖ పర్యటనకు వస్తుండడం తెలిసిందే. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో, మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. బహిరంగ సభకు తీసుకువెళుతున్న ప్రతి ఒక్కరిని మరల సురక్షితంగా వారి గ్రామంలో దించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆర్టీసీ బస్సులు పర్యవేక్షణకు సంబంధించి కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగులో ఇబ్బందులు రాకుండా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, అందరి సహకారంతో మోదీ పర్యటన విజయవంతం చేద్దామన్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, మండలాల నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్ నియంత్రణపై ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని, రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.