ఇన్వెస్ట్‌మెంట్లు చేసే వారికి అన్ని రకాల పథకాల గురించి తెలిసుండాలి. పెట్టుబడుల్లో స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు వంటివి మంచి రిటర్న్స్ ఇస్తున్నా.. వీటిల్లో రిస్క్ ఉంటుందని చెప్పొచ్చు. అన్నింటికీ సిద్ధపడితేనే ఇందులో పెట్టుబడులు పెట్టాలి. ఇంకా ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. అయితే ఇదే సమయంలో రిస్క్ లేకుండా రిటర్న్స్ కావాలంటే ప్రభుత్వ పథకాల్ని పరిశీలించాలి. వీటిల్లో పోస్టాఫీస్ లేదా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పథకాలు బెస్ట్. బ్యాంక్ డిపాజిట్లు కూడా ఉన్నప్పటికీ వాటి కంటే ఈ పోస్టాఫీస్ స్కీమ్స్‌లో వడ్డీ ఇంకాస్త ఎక్కువే వస్తుంది. వీటిల్లో ఎక్కువ బెనిఫిట్స్ అందించే.. లాంగ్ రన్‌లో మంచి రాబడి అందించే పోస్టాఫీస్ పథకం గురించి తెలుసుకుందాం. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.
ఈ పథకాల్లో వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంటుంది. వడ్డీ రేట్లను పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు లేదా స్థిరంగా ఉంచొచ్చు. ఇటీవల పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లను జనవరి- మార్చి సమయానికి గానూ ప్రకటించగా.. ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పీపీఎఫ్ స్కీమ్‌కు కూడా వడ్డీ రేటు 7.10 శాతం వద్ద యథాతథంగానే ఉంది. దీంట్లో దాదాపు నాలుగేళ్లుగా ఇదే వడ్డీ
ఇతర పథకాలతో పోలిస్తే ఇందులో ఉన్న అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే.. టాక్స్ బెనిఫిట్స్. దీంట్లో పెట్టుబడులపై, వడ్డీ ఆదాయంపై, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై పన్ను మినహాయించుకోవచ్చు. ఇంకా ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద పన్ను తగ్గించుకునే వెసులుబాటు ఉంది.
పీపీఎఫ్ విషయానికి వస్తే.. ఇందులో కనీసం రూ. 500 తో ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. లాకిన్ పీరియడ్ 15 సంవత్సరాలుగా ఉంది. అంటే వరుసగా 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏడాదిలో ఒకేసారి లేదా ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో చెల్లించొచ్చు. 15 ఏళ్ల తర్వాత.. ఐదేళ్ల చొప్పున వ్యవధి పొడిగించుకుంటూ పోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్కీంలో చేరిన ఆరేళ్ల తర్వాత పాక్షికంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిలో పెట్టుబడులపై లోన్లు కూడా తీసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒకటే పీపీఎఫ్ అకౌంట్ తీసుకోవాలి.
ఇన్వెస్ట్‌మెంట్ల విషయానికి వస్తే.. ఇందులో నెలకు రూ. 5 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. ఏడాదికి రూ. 60 వేల చొప్పున మొత్తం 15 ఏళ్లకు మీ పెట్టుబడి రూ. 9 లక్షలు అవుతుంది. ఇక్కడ 15 ఏళ్లలో మీ చేతికి రూ. 16.27 లక్షలు వస్తాయి. దీనిని ఐదేళ్ల చొప్పున పొడిగిస్తే 20 ఏళ్లకు చేతికి రూ. 26,63,315; 25 ఏళ్లకు అయితే రూ. 41,23,206 పొందొచ్చు.
ఇక నెలకు రూ. 10 వేల చొప్పున చూస్తే.. ఏటా రూ. 1.20 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు 15 ఏళ్లలో అయితే మొత్తం పెట్టుబడి రూ. 18 లక్షలు అవుతుంది. చేతికి రూ. 32,54,567 వస్తుంది. 20 ఏళ్లలో చేతికి రూ. 53,26,631; 25 ఏళ్లలో రూ. 82.46 లక్షలు వస్తుంది. ఇక గరిష్ట పెట్టుబడి అయిన రూ .1.50 లక్షలు అంటే నెలకు రూ. 12,500 చొప్పున అయితే 15 ఏళ్లకు మీ పెట్టుబడి రూ. 40,68,209 వస్తుంది. 20 ఏళ్లలో రూ. 66,58,288 అందుకోవచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం నెలకు రూ. 12500 లెక్కన మీ చేతికి 25 ఏళ్లలో 1,03,08,015 వస్తుంది. అంటే కోటీశ్వరులు కావొచ్చన్నమాట. ఇక్కడ మీ పెట్టుబడి రూ. 37.50 లక్షలుగా ఉంటుంది.