ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భరోసా ఇచ్చారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామని మోదీ హామీ ఇచ్చారు.‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదంతో 60 ఏళ్ల తర్వాత తొలిసారి మేం మూడోసారి అధికారంలోకి వచ్చాం. రాష్ట్రానికి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నాం. 2047 నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంతో భుజం భుజం కలిపి నడుస్తాం. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయి. ఐటీ, టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం కానుంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయి. 2030లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మా లక్ష్యం. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు వస్తుంటే.. దానిలో ఒకటి విశాఖకు కేటాయించాం. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది’’.