వైకుంఠ ద్వార దర్శన టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందడం బాధాకరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తొక్కిసలాటలో గాయపడి పద్మావతి మెడికల్ కాలేజిలో చికిత్స పొందుతున్న భక్తులను ఆయన గురువారం పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ భక్తుల మనోభావాలను కించపరిచేలా మాజీ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదన్న సంగతి ఆయన గుర్తు పెట్టుకోవాలన్నారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను విమర్శించే స్థాయి కరుణాకరరెడ్డికి లేదని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు సుగుణమ్మ, నరసింహ యాదవ్, జనసేన నాయకులు కిరణ్ రాయల్, రాజారెడ్డి, బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.