ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతి జిల్లా తిరుచానూరులో పర్యటించారు. తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, సీఎన్ జీ వాహనాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కాలుష్య రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.ఇంధనం విషయంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని అన్నారు. స్వచ్ఛమైన పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఏజీ అండ్ పి ప్రథమ్-థింక్ గ్యాస్ సరఫరా అమల్లో ఉందని తెలిపారు. పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు 2014-19 మధ్యే ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చంద్రబాబు వెల్లడించారు. 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించినట్టు వివరించారు. ఇంటింటికీ గ్యాస్ సరఫరా కోసం 5 కంపెనీలను సంప్రదించామని చెప్పారు. గ్యాస్ పైప్ లైన్ ను మొదట రాయలసీమ జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు.ఏపీకి పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయని, ఏపీలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ను ఇతర రాష్ట్రాల్లో వాడుతున్నారని పేర్కొన్నారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ దిశగా ప్రపంచం అడుగులు వేస్తోందని, ఏపీ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీతో అనేక ఉపయోగాలు ఉన్నాయని, భవిష్యత్ లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తుల ఎగుమతి కూడా చేస్తామని చెప్పారు.