సొంత గడ్డ మీద న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్‌కు గురైన టీమిండియా.. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సైతం కోల్పోయిన విషయం తెలిసిందే. పదేళ్ల తర్వాత భారత్ బీజీటీని కోల్పోగా.. ఆస్ట్రేలియా 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావడం ఈ టోర్నీలో జట్టు అవకాశాలను దెబ్బతీసింది. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శనపై బీసీసీఐ ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించింది.
ఈ సమీక్షకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీతోపాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యారు. ఈ భేటీలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల అసంతృప్తితో ఉన్న బీసీసీఐ.. ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని స్పష్టం చేసినట్లు సమాచారం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు కూడా ఖాళీ సమయాల్లో కచ్చితంగా దేశవాళీల్లో ఆడాలని.. అప్పుడే జాతీయ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోందట. ఒకవేళ గాయం కారణంగా ఎవరైనా మినహాయింపు కోరితే.. ఆ విషయంపై ఫిజియో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్‌లు కూడా అందుకు ఒప్పుకోవాలి.
ఇక ఇదే సమయంలో టీమిండియా భవిష్యత్ కెప్టెన్ ఎవరు? అనే అంశంపై కూడా బీసీసీఐ ఫోకస్ చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే, టెస్టు జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా ఉన్నాడు. వాస్తవానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత అతడు ఆటకు గుడ్ బై చెబుతాడని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. అయితే బీసీసీఐ సమీక్ష సమావేశంలో పాల్గొన్న రోహిత్.. మరికొన్ని నెలల పాటు తానే కెప్టెన్‌గా ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది.
భారత జట్టు తదుపరి కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే కొందరు మాత్రం కెప్టెన్సీ అనేది బుమ్రాపై మరింత ఒత్తిడి పెంచుతుందని.. దీంతో అతడి ఆటపై ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తున్నారు. సిడ్నీ టెస్టులో వెన్ను నొప్పితో బాధపడ్డ బుమ్రా ప్రస్తుతం కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అతడికి కెప్టెన్సీ ఇవ్వడం కరెక్టు కాదని బీసీసీఐ భావిస్తోంది! దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనుందని సమాచారం. ఆ తర్వాత కొత్త కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.