శ్రీకాకుళం జిల్లా, గార మండలం బందరువానిపేట వద్ద పడవ బోల్తా పడి కుంది గడ్డయ్య అనే మత్స్యకారుడు మృతి చెందడంపట్ల రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి మత్స్య శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం మృతిని కుటుంబానికి అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. సముద్రంలో వేట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత్స్యకారులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.కాగా బందరువాని పేట వద్ద గురువారం మధ్యాహ్నం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్య కారుడు కుందు గడ్డెయ్య (41) పడవ బోల్తా పడి మరణించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడ్డెయ్య, మరో నలుగురితో కలిసి బోటుపై సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. సముద్రంలో కొంతదూరం వెళ్లేసరికి అలల తాకిడికి బోటు బోల్తా పడింది. బోటులో ఉన్న గడ్డెయ్య సముద్రంలో పడి చనిపోయాడు. కాగా గడ్డెయ్యకు భార్య తోటమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చేపల వేటే జీవనాధారంగా బతుకుతున్న గడ్డెయ్య కుటుంబం దిక్కులేనిదైంది. ప్రభుత్వం తమను ఆదు కోవాలని వారు కోరుతున్నారు. భార్య తోటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ ఎం. చిరంజీవిరావు కేసు నమోదు చేశారు.