విజయ పాల డైరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. విజయ పాల డైరీలో ఖాళీ అయిన మూడు డైరెక్టర్ల పదవులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం నామినేషన్లు స్వీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో డైరీలో నామినేషన్ ప్రక్రియ సక్రమంగా జరపట్లేదని ఆళ్ళగడ్డ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వర్గం నిరసన చేపట్టింది. పాలకవర్గం భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిని సొసైటి అధ్యక్షుడిగా అనర్హత వేటు వేసింది. దీంతో న్యాయం కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ఉత్కంఠంగా మారింది. కాగా డైరీ నామినేషన్ల నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.నిరసన తెలుపుతున్న భూమా అనుచరులును గేట్లు తెరుచుకుని లోపలికి రావటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. డెయిరీ వద్దకు ఇతరులు వచ్చేందుకు అనుమతి లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు లాండ్ ఆర్డర్ సమస్యతో విజయడెయిరీ నామినేషన్ల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. నామినేషన్ల తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టంచేసింది. కాగా డెయిరీ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న భూమా విఖ్యాత్ రెడ్డిని ఇటీవల పాలకవర్గం తొలగించింది. అంతేకాదు సస్పెన్షన్ వేటు కూడా వేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పాలక వర్గం విధించిన అనర్థత వేటును సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో నంద్యాలలో ఆ రోజు నుంచి డెయిరీ పాలక వర్గం వర్సెస్ విఖ్యాత్ రెడ్డిగా పరిస్థితి మారిపోయింది.