‘డాడీ, అమ్మా.. పదేళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. బతకాలంటే భయమేస్తోందమ్మా. నన్ను క్షమించండి డాడీ, అమ్మా. సారీరా తమ్ముడూ’.. అని సూసైడ్ నోట్ రాసి.. ఓ ఎంబీబీఎస్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మిమ్స్‌లో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఆత్కూరి సాయిమణిదీప్(24) కళాశాల హాస్టల్‌లో శనివారం రాత్రి గడ్డి మందు తాగి తనువు చాలించాడు. చదువులో వెనుకబడడం, ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెడుతున్నానన్న తీవ్ర మానసిక సంఘర్షణతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మణిదీప్ ద్వితీయ సంవత్సర సబ్జెక్టులు ఉండిపోవడంతో అవి రాసేందుకు పండుగకు ఇంటికి వెళ్లకుండా హాస్టల్‌లోనే ఉండిపోయినట్లు సమాచారం. ఓ పక్క ఏకాంతం, మరోపక్క మానసిక సంఘర్షణ.. ఆత్మహత్యకు పురిగొల్పి ఉండవచ్చని భావిస్తున్నారు. మణిదీప్ తండ్రి రామారావు నిడదవోలు మండలం అట్లపాడులోని వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్‌గా ఉన్నారు.