పరీక్షలు.. మార్కులు.. ర్యాంకులు అంటూ విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. ప్రధానంగా ఇంటర్మీడియట్ విద్యార్థులపై ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉండడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలో ఎక్కడా ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలను నిర్వహించడం లేదు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా ఇంటర్ విద్యలో సమూల మార్పులకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేయనున్నట్టు ఇటీవల ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికాశుక్లా వెల్లడించారు.ఇంటర్మీడియట్ విద్య సీబీఎస్‌ఈ విధానంలోకి మారనుంది. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు రెండు భాషలతో పాటు ఆ గ్రూపునకు సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయి. సైన్స్ విద్యార్థులకు నాలుగు సబ్జెక్టులు, ఆర్ట్స్‌కు మూడు సబ్జెక్టుల విధానం ఉంది. ఇప్పుడు ఎంపీసీ విద్యార్థులకు ఉన్న మ్యాథ్స్ పేపర్లను ఒకే పేపర్‌గా, బైపీసీ విద్యార్థులకు బోటని, జువాలజీని ఒకే పేపర్‌గా తీసుకొస్తున్నారు.ఇంగ్లీష్ సబ్జెక్టు అందరికి కచ్చితంగా ఉంటుంది. ద్వితీయ సబ్జెక్టుగా ఏదైనా భాష కానీ లేదా ఇతర గ్రూపునకు చెందిన ప్రధాన సబ్జెక్టుకానీ ఎంపిక చేసుకోవచ్చు. దీని కోసం 23 ఆప్షన్లు ఉంటాయి. అంటే ఎంపీసీ చదివే విద్యార్థులు జువాలజీ, బోటనీ సబ్జెక్టు కానీ ఆర్ట్స్ సబ్జెక్టుగాని తీసుకోవచ్చు. మూడు, నాలుగు, ఐదో సబ్జెక్టులు ఎంపిక చేసుకున్న గ్రూపు సబ్జెక్టులు ఉంటాయి. ఐచ్ఛికంగా 6వ సబ్జెక్టు ఉంటుంది. దీనికి కూడా భాష లేదా ఇతర గ్రూపునకు చెందిన 23 ఆప్షన్ల నుంచి ప్రధాన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ప్రధానంగా ఎంచుకున్న ఐదు సబ్జెక్టులలో ఒకటి తప్పితే, ఆప్షన్ సబ్జెక్టు పాసైతే దానిని పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను ఉత్తీర్ణత చేస్తారు. ఈ విధానం అమలవ్వాంటే ఐదు ప్రధాన సబ్జెక్టుల్లో ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటివరకు ప్రథమ సంవత్సరంలో 500 మార్కులకు, ద్వితీయ సంవత్సరంలో 500 మార్కులకు పరీక్షలు జరుగుతున్నాయి. నూతన విధానంలో మార్కులు అదే మాదిరి ఉన్నా, ఉత్తీర్ణత శాతం కోసం ప్రథమ సంవత్సరం మార్కులు పరిగణనలోకి తీసుకోరు. ద్వితీయ సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుని ఉత్తీర్ణత శాతం కేటాయిస్తారు. ఈ విధానంలో ప్రతి సబ్జెక్టుకీ అంతర్గత మార్కులు ఉంటాయి. ఆర్ట్స్ గ్రూప్‌లో ఇంగ్లీష్‌తో పాటు ఎంచుకున్న సబ్జెక్టుకు థియరీ మార్కులు 80, ఇంటర్నర్ మార్కులు 20 ఉంటాయి. సైన్స్ సబ్జెక్టులో థియరీ 70 మార్కులు, ఇంటర్నల్ 30 మార్కులు ఉంటాయి. ప్రశ్నాపత్రాల్లో ఒక మార్కు, 5,6 మార్కుల ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు.