ఏపీలో స్కిల్, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని అన్నారు. ఫైల్స్ పట్టుకుని గతంలో న్యూయార్క్ వీధుల్లో చంద్రబాబు తిరిగారని గుర్తుచేశారు. ఆలోచనల్లో చంద్రబాబుతో పోటీపడలేకపోతున్నామన్నారు. జైల్లో పెట్టినప్పుడూ చంద్రబాబు అధైర్య పడలేదన్నారు. జైల్లో కలవడానికి వెళ్తే తమకు ధైర్యం చెప్పేవారని అన్నారు. యూరప్‌లో అనేకమంది తెలుగువారు వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. తెలుగువారు ఎక్కడున్నా గొప్పగా ఉండాలని చంద్రబాబు కోరిక అని చెప్పారు. అన్నిరంగాల్లో నెంబర్ వన్‌గా ఉండాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష అని చెప్పారు. జ్యురిచ్‌లో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెడ్‌బుక్ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రెడ్‌బుక్ తనపని తాను చేసుకుపోతుందని లోకేష్ తేల్చిచెప్పారు. జ్యురిచ్‌లో గల హిల్టన్ హోటల్‌లో స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ బృందం ఇవాళ(సోమవారం) భేటీ అయింది. స్విట్జర్లాండ్‌లో ఫార్మా పరిశ్రమ వంద బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగి ఉందని అన్నారు. ఏపీ ఫార్మా రంగంలో పెట్టుబడులకు సహకరించాలని రాయబారి మృదుల్ కుమార్‌ను చంద్రబాబు బృందం కోరారు.