గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విశాఖ ఉక్కును సీఎం చంద్రబాబు కాపాడారని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని తెలిపారు. ఇవాళ(మంగళవారం) విశాఖపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ... ఏపీ అభివృద్ధి స్టీల్ ప్లాంట్ వల్లే సాధ్యం అవుతుందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కేవలం భూ దోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని ఆరోపించారు. రైల్వే జోన్ భవనాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వానికి ఏపీ అభివద్ధిపై ఉన్న చిత్త శుద్ధికి ఇదే నిదర్శనమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 99 శాతం భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయని చెప్పారు. అనకాపల్లిలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ మీద ఆర్సిలర్ సంస్థ మిట్టల్‌తో సీఎం చంద్రబాబు దావోస్‌లో ఏంవోయూ చేసుకున్నారని చెప్పారు. ఐదేళ్ల క్రితం జగన్ ప్రభుత్వం విశాఖలో భూములు కొట్టేసిందని ఆరోపించారు. దసపల్లా, వాల్తేరు క్లబ్ భూములు కూడా కొట్టేసేందుకు ప్రయత్నం చేశారని విమర్శించారు. విశాఖకు టీసీఎస్, గూగుల్, సంస్థలు వస్తున్నాయని తెలిపారు. పోలవరం పనులు వేగంగా జరుగుతాయని అన్నారు. పోలవరం నుంచి బాహుదా వరకు అన్ని ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.