శ్రీకాకుళం నగరంలోని న్యూ కాలనీ లోని ఓ ఇంట్లో మహిళ హత్య కేసును ఛేదించే దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం నగర వాసులను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలో అనుమానితుడ్ని టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఆయా వర్గాలు ద్వారా తెలుస్తోంది. పొందూరు మండలంలో ఓ గ్రామానికి చెంది వివాహితతో శ్రీకాకుళం నగరానికి చెందిన శరత్‌కుమార్‌కు కొన్నా ళ్లుగా పరిచయం ఏర్పడగా.. ఆమె తరచూ అతడి ఇంటికి వెళ్తున్నట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం శరత్ ఉంటున్న ఇంటికి వెళ్లిన ఆమె హత్యకు గురైందని పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఆధారాలను సోమవారం పోలీసులు సేకరించారు. కాగా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదివారం అర్ధరాత్రి దాటాక హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద, టూటౌన్ సీఐ ఈశ్వరరావుతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.