ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సహా 54 మంది రాష్ట్ర మంత్రులు మహా కుంభమేళా నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తకోటి తరలి వస్తోంది.45 రోజుల పాటు జరగనున్న ఈ కుంభమేళాలో ప్రతిరోజు కోటి మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మంత్రులతో కలిసి సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈరోజు పుణ్యస్నానాలు ఆచరించారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక హారతి ఇచ్చారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో భక్తులకు మహాప్రసాదాన్ని వడ్డించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత స్థానిక ఇస్కాన్ క్యాంప్‌ను సందర్శించి భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వడ్డించారు.సుధామూర్తి తొలుత ఇస్కాన్ వంటశాలకు వెళ్లి అక్కడి వాలంటీర్లతో మాట్లాడారు. మెషీన్లతో భోజన తయారీని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కౌంటర్ వద్ద నిలబడి కుంభమేళాకు వచ్చిన భక్తులకు చపాతి, భోజనం వడ్డించారు. ఈ కుంభమేళాను ఆమె తీర్థరాజ్‌గా అభివర్ణించారు.