కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పన్ను శ్లాబుల్లో కీలక మార్పులు చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపులు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మధ్య తరగతి ప్రజలు, వేతన జీవులకు భారీ ఊరట లభించినట్లయింది. కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ శ్లాబుల్లో కీలక మార్పులు చేశారు. పన్ను రిబేట్‌తో కలిపి రూ.12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు పన్ను సున్నా. మరి పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానంలో లేటెస్ట్ పన్ను శ్లాబులు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొత్త విధానంలో ట్యాక్స్ శ్లాబులు..
రూ. 4,00,000 జీరో ట్యాక్స్
రూ.4,00,001- రూ.8,00,000 5 శాతం
రూ.8,00,000- రూ.12,00,000 10 శాతం
రూ.12,00,000- రూ.16,00,000 15 శాతం
రూ.16,00,000- రూ.20,00,000 20 శాతం
రూ.20,00,000- రూ.24,00,000 25 శాతం
రూ.24 లక్షల పైన 30 శాతం
పాత పన్ను విధానంలో పన్ను శ్లాబులు
రూ.2,50,000 జీరో ట్యాక్స్
రూ.2,50,001 - రూ.5,00,000 5 శాతం
రూ.5,00,000 నుంచి రూ. 10,00,000 20 శాతం
రూ.10,00,000 ఆపైన 30 శాతం
ఆదాయపు పన్నులకు సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. త్వరలోనే కొత్త పన్ను చట్టం తీసుకొస్తున్నట్లు చెప్పారు. వచ్చే వారంలోనే కొత్త ఆదాయపు పన్ను చట్టం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీని ద్వారా పన్నుల చెల్లింపుల్లో ఉన్న క్లిష్టతరమైన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్, టీడీఎస్, టీసీఎస్ వంటి సంక్లిష్టమైన ప్రక్రియలను మరింత సులభతరం చేస్తామని చెప్పారు. మరి ఈ కొత్త ఆదాయపు పన్ను చట్టంలో ఎలాంటి మార్పులు ఉంటాయో వేచి చూడాల్సింది. ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అమలులో ఉంది. ఈ చట్టాలకు లోబడి పన్ను వసూలు, మినహాయింపులు జరుగుతున్నాయి.