చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10 శాతం సుంకం పెంపు అమెరికా ఉత్పత్తులపై 15 శాతం సుంకం పెంచిన చైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చీ రావడంతోనే వివిధ దేశాలపై వాణిజ్య టారిఫ్ ల సవరణకు పూనుకున్నారు. పలు దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ ముఖ్యంగా చైనాపైనా ఫోకస్ చేశారు. చైనా నుంచి అమెరికాకు వచ్చే అన్ని రకాల ఉత్పత్తులపై 10 శాతం సుంకం విధించారు. తద్వారా డ్రాగన్ కంట్రీతో వాణిజ్య యుద్ధానికి మరోసారి తెరలేపారు. దీనిపై చైనా కూడా దీటుగా స్పందించింది. అమెరికా నుంచి తమ దేశానికి వచ్చే బొగ్గు, ద్రవరూప సహజ వాయువులపై 15 శాతం సుంకం విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా, అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ పైనా చైనా విచారణకు ఆదేశించింది. దీనిపై చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. టారిఫ్ లు పెంచుతూ అమెరికా తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇలాంటి నిర్ణయాలు అమెరికా సమస్యలను పరిష్కరించలేవని... ఇటువంటి వైఖరి చైనా-అమెరికా మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని బలహీనపరుస్తుందని వివరించింది.